Subrahmanya Swamy: జార్జ్ ఫెర్నాండెజ్ పేరు చెబితేనే ఇందిరాగాంధీ భయపడేవారు: సుబ్రహ్మణ్య స్వామి
- ఎమర్జెన్సీ సమయంలో ఇందిర తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత
- ఆయన్ను అరెస్ట్ చేయించిన తరువాత ప్రశాంతంగా ఉన్న ఇందిర
- జార్జ్ ఫెర్నాండెజ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి
జార్జి ఫెర్నాండెజ్ పేరు చెబితేనే ఇందిరా గాంధీ భయపడేవారని, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిర తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, ఆయన్ను అరెస్ట్ చేయించిన తరువాత మాత్రమే ఇందిర ప్రశాంతంగా ఉండగలిగారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జార్జ్ ఫెర్నాండెజ్ తీవ్ర అస్వస్థత కారణంగా ఢిల్లీలో కన్నుమూయగా, ఆయనతో తన అనుబంధాన్ని సుబ్రహ్మణ్య స్వామి గుర్తుచేసుకున్నారు.
గాంధీ కుటుంబం అంటే ఫెర్నాండెజ్ కు ఇష్టం ఉండేది కాదని అన్నారు. గాంధీ ఫ్యామిలీ దేశాన్ని నాశనం చేస్తోందని నమ్మే వ్యక్తి ఆయనని, తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఫెర్నాండెజ్ తనకు ప్రియ మిత్రుడని, తాము తరచూ కలుసుకుని, వివిధ అంశాలపై చర్చలు జరిపేవారిమని స్వామి గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పలు ర్యాలీలను, సభలను ఆయన నిర్వహించారని అన్నారు.
ఆయన రక్షణమంత్రిగా ఉన్న సమయంలో బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని భావించారని, అయితే, ఫెర్నాండెజ్ ప్రయత్నాన్ని వాజ్ పేయి అడ్డుకున్నారని, సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన రక్షణ మంత్రి ఆయనని అన్నారు.