Daggubati purandeshwari: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆవేదనగా స్పందించిన పురందేశ్వరి.. ఎవరికీ తెలియని విషయాలు ఇవేనంటూ నోట్!

  • వైసీపీలో చేరబోతున్న దగ్గుబాటి కుటుంబం
  • సోషల్ మీడియాలో ట్రోల్స్
  • దయచేసి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దంటూ వేడుకోలు

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్‌లు వైసీపీ చీఫ్ జగన్‌ను కలిసినప్పటి నుంచీ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దగ్గుబాటి కుటుంబ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతుండగా, ఇంకొందరు సమర్థిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు భార్య, బీజేపీ నేత అయిన పురందేశ్వరి ఆవేదనగా స్పందించారు.

కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అత్యంత సున్నితమైన వ్యక్తిగత విషయాలను బయటకు లాగి రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టారు.
 
తాను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం ఎంతమందికి తెలుసని, కుమార్తె కంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరిని కోల్పోయానని పురందేశ్వరి తెలిపారు. ప్రత్యేక వైద్య చికిత్సల కోసం తాను అమెరికా వెళ్లిన విషయం ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. తండ్రి ఎన్టీఆర్ తనను బలవంతంగా అమెరికా పంపించారన్న విషయం ఎంతమందికి తెలుసన్నారు.
 
తనపై జరుగుతున్న ఈ మొత్తం ప్రచారం విషయంలో తాను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని వెంకటేశ్వరరావు అనుకున్నప్పుడు టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? అని నిలదీశారు. 2014లో తనకు టికెట్ రాకుండా చేసేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. తాను ఏ వ్యక్తినీ వ్యక్తిగతంగా విమర్శించనని పేర్కొన్న పురందేశ్వరి రాజకీయాలకు అతీతంగా తన కుటుంబాన్ని ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. దయచేసి ఇకపై తన వ్యక్తిగత విషయాల జోలికి, పిల్లలు, కుటుంబం జోలికి రావొద్దంటూ నెటిజన్లను అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News