KA Paul: కేఏ పాల్ ఆఫర్‌ను స్వీకరించిన యాంకర్ శ్వేతారెడ్డి.. హిందూపురం నుంచి ఎన్నికల బరిలోకి!

  • పార్టీ టికెట్‌కు ఎంత తీసుకుంటారని పాల్‌ను ప్రశ్నించిన శ్వేతారెడ్డి
  • పైసా కూడా తీసుకోనంటూ శ్వేతకు ఆఫర్
  • ఉబ్బితబ్బిబ్బవుతున్న టీవీ యాంకర్

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన ఆఫర్‌ను టీవీ యాంకర్ శ్వేతారెడ్డి స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. పాల్ రూపంలో తనకు దక్కిన అదృష్టంపై శ్వేతారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, కానీ రాజకీయాల్లోకి రావాలన్న తన కల ఇలా నెరవేరబోతోందంటూ పాల్ ఆఫర్‌ను స్వీకరించారు.

ఇటీవల పాల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ టికెట్ కోసం ఎంత డబ్బు తీసుకుంటారని పాల్‌ను శ్వేతారెడ్డి ప్రశ్నించారు. శ్వేతారెడ్డి ప్రశ్నకు పాల్ బదులిస్తూ.. ఒక్క రూపాయి కూడా తీసుకోబోనని, అవసరమైతే మీరు కూడా రావొచ్చంటూ ఆహ్వానించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నా టికెట్ ఇస్తానంటూ బంపరాఫర్ ఇచ్చారు.

పాల్ ఆఫర్‌తో తొలుత ఆశ్చర్యపోయిన శ్వేతారెడ్డి తర్వాత ఆనందంలో మునిగిపోయారు. తనకు రాజకీయాలంటే ఎంతో ఇష్టమని, జర్నలిస్టుగా తనకు చాలా అనుభవం ఉందని శ్వేత పేర్కొన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచన ఉన్నా డబ్బులు అడుగుతారన్న ఉద్దేశంతో తన కోరికను చంపుకున్నానని శ్వేత తెలిపారు. ఇప్పుడు కేఏ పాల్ రూపంలో ఆ అవకాశం వచ్చిందని సంబరపడ్డారు. రాజకీయాలే తన చివరి గమ్యమని పేర్కొన్నారు.

రాజకీయాల ద్వారా ప్రజా సేవకు అంకితమవుతానని పేర్కొన్న శ్వేతారెడ్డి రానున్న ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయం కోసం కృషి చేస్తానని పేర్కొన్న శ్వేతారెడ్డి తనకు పొగడ్తల కంటే విమర్శలే ఎక్కువ ఇష్టమని చెప్పారు.

KA Paul
TV Anchor Swetha Reddy
Praja shanthi party
Hindupur
Andhra Pradesh
  • Loading...

More Telugu News