Train 18: ట్రైన్ 18 పేరు ఇక 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'!: రైల్వేమంత్రి
- శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో కొత్త రైలు
- గంటకు 160 కిలోమీటర్ల వేగం
- ఢిల్లీ-వారణాసి మధ్య తిరగనున్న రైలు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ట్రైన్ 18’కు కేంద్రం నామకరణం చేసింది. ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’గా ఈ రైలుకు పేరు పెట్టినట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీ-వారణాసి మధ్య చక్కర్లు కొట్టనున్న ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. మూడు దశాబ్దాల క్రితం ఇండియన్ రైల్వేలో ప్రవేశించిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సక్సెసర్‌గా దీనిని తీసుకొస్తున్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
రూ. 97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలీలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం 18 నెలల్లోనే దీనిని తయారు చేశారు. దేశంలోని తొలి ఇంజిన్ లెస్ (లోకోమెటివ్ లేని) రైలుగా ఇది గుర్తింపు పొందనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలుకు పేరు పెట్టాల్సిందిగా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు కోరింది. వేలాదిమంది పలు పేర్లు సూచించినప్పటికీ చివరికి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ గా పేరు పెట్టినట్టు గోయల్ తెలిపారు.