Jayalalitha: ఇప్పటికీ జయలలిత బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా నగదు జమ.. గుర్తించిన ఐటీ శాఖ!
- జయలలిత ఖాతాల్లో క్రమం తప్పకుండా అద్దెను జమచేస్తున్న వ్యాపారులు
- జయలలిత ఆస్తుల సీజ్‌కు సంబంధించి హైకోర్టుకు ఐటీ శాఖ నివేదిక
- రూ. 20 కోట్లు దాటిన పన్ను బకాయిలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బ్యాంకు ఖాతాలు ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఆమె ఖాతాల్లో ప్రతి నెల క్రమం తప్పకుండా నగదు జమ అవుతోంది. ఆమె భవనాలలో నివసిస్తున్నవారు, దుకాణ యజమానులు, వ్యాపారులు ప్రతినెల అద్దెను ఆమె ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. వారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
రూ.16.74 కోట్ల ఆస్తి పన్నును జయలలిత బకాయి పడడంతో చెన్నై మందవెల్లిలో ఉన్న ఓ భవనం, అన్నాశాలై పార్సన్మనేర్లోని దిగువ అంతస్తు, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రెసిడెన్షియల్ ఫ్లాట్, పోయెస్ గార్డెన్లో వేద నిలయాన్ని అటాచ్ చేసినట్టు ఐటీ అధికారులు ఇటీవల హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కాగా, జయలలిత మృతి చెందే నాటికే ఆమె చెల్లించాల్సిన ఆస్తిపన్ను రూ. 20 కోట్లు దాటినట్టు సమాచారం.
జయ చనిపోయిన అనంతరం ఆమెకు సంబంధించిన ఆస్తుల ద్వారా ఆదాయం కంటే అప్పులు, పన్నులే ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని చూసుకునేందుకు, పరిష్కరించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.