penna group: వైయస్ సీఎంగా ఉండగా.. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి.. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • పెన్నా గ్రూపుకు హైకోర్టులో చుక్కెదురు
  • వైయస్ నిర్ణయాల తర్వాత ఆయన కుమారుడి కంపెనీల్లోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి
  • ప్రజల కోసం ఉపయోగపడాల్సిన సంపద పెడదారిన పడుతోంది

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెన్నా గ్రూపు కంపెనీలకు నిన్న హైకోర్టులో చుక్కెదురైంది. తమపై ఉన్న సీబీఐ కేసులను ఎత్తివేయాలంటూ పెన్నా గ్రూపు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది.

'రాజకీయ రంగంలో అవినీతి క్యాన్సర్ లా విస్తరిస్తోంది. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. కొత్త విషయాలను కనిపెట్టి, సమాజానికి ఉపయోగపడాలన్న జిజ్ఞాసను నాశనం చేస్తోంది. జాతి సంపద అయిన గనులను ఇష్టానుసారం తమకు ఇష్టమైన వ్యక్తులకు కట్టబెడుతోంది. ఇందుకోసం నిషేధ చట్టాన్ని సైతం అతిక్రమిస్తోంది. వీటి వెనుక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది.

ఏ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నిర్ణయాలు జరిగాయో... అదే ముఖ్యమంత్రి కుమారుడి కంపెనీల్లోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి, ప్రతిభకు, సమాజానికి తీవ్రంగా హాని కలిగిస్తాయి. వీటిని సాధారణమైన నేరాలుగా చూడలేం. ప్రజల కోసం ఉపయోగపడాల్సిన జాతీయ సంపద ఇలా పెడదారిన పడితే... తరాల కొద్దీ యువత తన మేధస్సుకు పనిపెట్టే అవకాశాన్ని కోల్పోతుంది. ఇలాంటి చర్యలు పెట్టుబడులు రావడానికి కానీ, ఉద్యోగాల కల్పనకు కానీ ఎంత మాత్రం ఉపయోగపడవు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవి నాశనం చేస్తాయి. పెన్నా సిమెంట్స్ కు కేటాయింపుల తర్వాత జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయంటే ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రోకోలో (నీకది నాకిది) భాగమే. దురుద్దేశంతో జరిగిన దీనిపై చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

  • Loading...

More Telugu News