Andhra Pradesh: కొమరవోలులో చంద్రబాబు పర్యటన.. ‘నారా దేవాన్ష్ కాలనీ’ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి!
- నేడు కొమరవోలులో సీఎం పర్యటన
- కొమరవోలును దత్తత తీసుకున్న భువనేశ్వరి
- పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్న కొమరవోలు గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. తొలుత కొమరవోలుకు హెలికాప్టర్ లో చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత రూ.25 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం, రూ.15 లక్షలతో నిర్మించిన మహిళ సమైక్య భవనం, రూ.4.40 కోట్లతో నిర్మించిన అంతర్గత డ్రెయినేజీ, రూ.1.70 కోట్లతో నిర్మించిన కొమరవోలు-గొల్వేపల్లి రహదారితోపాటు రూ.2.8 లక్షలతో నిర్మించిన సీసీ రహదారి, ఎన్టీఆర్ గృహ యోజన పథకం కింద పేదలు నిర్మించుకున్న 54 గృహ సముదాయాల 'నారా దేవాన్ష్ కాలనీ'ని సీఎం ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశారు. భద్రత కోసం ఇద్దరు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, వెయ్యి మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులను మోహరించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్లూరి కృష్ణబాబు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యాలయం, మహిళా సాధికారత భవనాన్ని, ఎన్టీఆర్ గృహ సముదాయాన్ని సీఎం స్వయంగా ప్రారంభిస్తారనీ, మిగిలినవి గ్రామంలో ఏర్పాటుచేసిన పైలాన్ ద్వారా ఆవిష్కరిస్తారని తెలిపారు.