Upendra: కర్ణాటకలో 28 స్థానాల్లోనూ పోటీ చేస్తాం.. ప్రకాశ్‌రాజ్ వస్తే ఆలోచిస్తాం!: సినీ నటుడు ఉపేంద్ర
- విభేదాల వల్ల కేపీజేపీ నుంచి బయటకు వచ్చా
- మా పార్టీలో అందరికీ ఒకే రకమైన నియమాలు
- చక్కని మేనిఫెస్టోతో ముందుకొస్తే ప్రకాశ్ రాజ్‌కు మద్దతు
రానున్న లోక్‌సభ ఎన్నికలలో బరిలోకి దిగుతున్నట్టు ప్రముఖ కన్నడ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) అధ్యక్షుడు ఉపేంద్ర పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు.
బరిలో ఎవరిని నిలపాలన్న దానిపై ఓ ప్రక్రియ ఉందని, అందులో తాను నెగ్గితే ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. మరో రెండు మూడు వారాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు ఉపేంద్ర తెలిపారు.
పార్టీ టికెట్ ఆశిస్తున్న 20 మంది ఇప్పటికే తనను సంప్రదించినట్టు ఉపేంద్ర తెలిపారు. కర్ణాటక సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించిన మరో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుపై మాట్లాడుతూ.. తమ పార్టీలో అందరికీ ఒకే రకమైన నియమాలు ఉంటాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని మేనిఫెస్టోతో వస్తే ఆయనకు మద్దతు ఇవ్వడం గురించి ఆలోచిస్తామన్నారు. యూపీపీ రాజకీయాలు చేయదని, ప్రజలు కోరుకున్నదే చేస్తుందని వివరించారు.
గతంలో కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)ని స్థాపించిన ఉపేంద్ర ఆ పార్టీ నుంచి తనే ఎందుకు బయటకు వచ్చిందీ బయటపెట్టారు. ఆ పార్టీతో ఉన్న విభేదాల వల్లే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని వివరించారు. తాను స్వయంగా స్థాపించిన పార్టీ నుంచి కూడా బయటకు రావడానికి అదే కారణమని ఉపేంద్ర పేర్కొన్నారు.