KCR: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. చెరువుల్లా మారిన రహదారులు
- తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి
- శనివారం రాత్రి గంటన్నర పాటు కుమ్మేసిన వర్షం
- అర్ధరాత్రి సమీక్షించిన కేసీఆర్
హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. రాత్రి 9:30 గంటల నుంచి 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్‌ను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ బృందాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్టు సీఎంకు తెలిపారు.
ఉపరితల ద్రోణి కారణంగా నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఫలితంగా తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.