Haryana: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం
- హరియాణాలోని గురుగ్రామ్ జిల్లా ఉల్లావాజ్ గ్రామంలో ఘటన
- శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకున్నట్లు అనుమానం
- నాలుగో అంతస్తు నిర్మాణం పనులు జరుగుతుండగా ఘటన
నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. నాలుగో అంతస్తు నిర్మాణం పనులు కొనసాగిస్తుండగా హఠాత్తుగా భవనం కుప్పకూలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ జిల్లా ఉల్లావాజ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు తెలిపిన వివరాలివి.
నేటి తెల్లవారు జామున నిర్మాణ కార్మికులు నాలుగో అంతస్తులో పనులు చేపడుతున్నారు. ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయానికి పనుల్లో నిమగ్నమై ఉన్న ఎనిమిది మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఆధునిక యంత్రాలతో శిథిలాలను తొలగించే చర్యలు చేపట్టి వాటికింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. అయితే భారీ స్థాయిలో కాంక్రీట్, ఇనుప చువ్వలు నిండి ఉండడంతో శిథిలాల తొగింపునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.