POCSO: ఫోక్సో చట్టం కింద విధించిన వినూత్నమైన శిక్ష!
- 2015లో బాలిక ముందు అసభ్య ప్రవర్తన
- కేసును విచారించిన ముంబై క్రిమినల్ కోర్టు
- ఒక రోజు కోర్టులో కూర్చోవాలని శిక్ష
ఫోక్సో... చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడటం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి క్రూరమైన నేరాలు చేసే వ్యక్తులను అదుపు చేసేందుకు తెచ్చిన కఠిన చట్టం. ఈ చట్టం కింద ఓ వ్యక్తి దోషిగా నిరూపితం కాగా, అతనికి కోర్టు ఆశ్చర్యకరమైన శిక్ష విధించింది. రోజంతా కోర్టు రూములోనే కూర్చోవాలన్న శిక్షను విధిస్తూ, రూ. 30 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. ముంబై క్రిమినల్ కోర్టు ఈ తీర్పు ఇవ్వగా, ఫోక్సో చట్టం కింద నేరం నిరూపితమై పడిన అతి తక్కువ శిక్ష ఇదేనని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
కేసు వివరాల్లోకి వెళితే, తన ఎదురింట్లో ఉండే 12 సంవత్సరాల బాలికతో అరవింద్ కబ్ దేవ్ కామత్ (29) అనే వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తన ఇంట్లో నగ్నంగా నిలుచుని, కిటికీ నుంచి ఆమెను చూస్తూ సైగలు చేశాడు. ఈ ఘటన 2015లో జరుగగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు గోవాదేవీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, దాదాపు మూడేళ్ల పాటు విచారణ జరిగింది.
ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తూ, కోర్టు ముగిసే వరకూ ఇక్కడే కూర్చోవాలని, ఇక్కడికి వచ్చి పోయే వారంతా ఆయన ఘనకార్యం గురించి ముచ్చట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు. జరిమానా కట్టకుంటే, మూడు నెలల పాటు జైల్లో శిక్ష అనుభవించాలని తెలిపారు.