cable operators fedaration: జీఎస్టీ పరిధి నుంచి కేబుల్ ఆపరేటర్లను మినహాయించాలి: తెలంగాణ ఫెడరేషన్ డిమాండ్
- సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి
- ట్రాయ్ నిబంధనలతో డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ పెనుభారం
- కస్టమర్లకూ ఇబ్బందులేనని ఆందోళన
జీఎస్టీ పరిధి నుంచి కేబుల్ ఆపరేటర్లను మినహాయించాలని తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ పెడరేషన్ డిమాండ్ చేసింది. ట్రాయ్ సరికొత్త టారిఫ్ విధానంతో డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ మెడపై కత్తివేలాడుతోందని, వినియోగదారులపైనా అదనపు భారం పడుతుందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓలను కాపాడడానికే న్యూ టారిఫ్ విధానం అమల్లోకి తెచ్చారని సమావేశం అభిప్రాయపడింది.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు వినోదాన్నిచ్చే కేబుల్ వ్యవస్థపై జీఎస్టీ ఎత్తివేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యపై కేంద్రంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాయ్ విధించిన గరిష్ట ధర 19 రూపాయలను ఐదు రూపాయలకు తగ్గించాలన్నారు. ప్రస్తుతం 350 చానళ్లకు కస్టమర్ నుంచి రూ.250 వసూలు చేస్తున్నామని, నూతన విధానం అమలు చేయాలంటే వెయ్యి రూపాయలు వసూలు చేయాలన్నారు. సెట్ ఆఫ్ బాక్స్‌లు వినియోగదారులవని, కానీ ఎంఎస్ఓలు తమవని బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాడ్ కాస్టర్లు, ఎంఎస్ఓలకు అనుకూలంగా ఉన్న నూతన విధానం వినియోగదారులకు పెనుభారమని, కనీసం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినా కొంత భారం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.