Hyderabad: మెడిసిన్ లో సీటు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిని మోసం చేసిన కేటుగాడు!
- మెడిసిన్ సీటు కోసం ప్రయత్నిస్తున్న యువతి
- తన మామయ్య సోనియా వద్ద పీఏ అని నమ్మబలికిన మోసగాడు
- నమ్మి డబ్బిచ్చి మోసపోయిన యువతి
మెడిసిన్ లో సీటు కోసం ఓ విద్యార్థిని పదేపదే ప్రయత్నించి విఫలమవుతున్న వేళ, ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ కేటుగాడు, తాను సాయం చేస్తానని చెబుతూ అడ్డంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తన మామయ్య సోనియాగాంధీ వద్ద పీఏగా పని చేస్తున్నాడని అతను చెప్పిన మాటలను విన్న ఆ అమ్మాయి లక్ష రూపాయలకు పైగా సమర్పించుకుని ఇప్పుడు లబోదిబోమంటోంది.
పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, హైదరాబాద్, అమీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినికి, ఫేస్ బుక్ ద్వారా నిఖిల్ సింగ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులుగా మారి, చాటింగ్ కూడా చేసుకునేవారు. తనకు డాక్టర్ కావాలన్నది ఓ కలని, ఎన్నిసార్లు ప్రయత్నించినా మెడిసిన్ లో సీటు రాలేదని ఆమె చెప్పుకోగా, ఓదారుస్తున్నట్లు నటించిన నిఖిల్, ఎంబీబీఎస్ చేయాలని ఇప్పటికీ ఉందా? అంటూ అడుగుతూ, నగరంలోని గాంధీ మెడికల్ కాలేజీలోనే సీటిప్పిస్తానని నమ్మబలికాడు.
అదెలా సాధ్యమని యువతి అడుగగా, తన మామయ్య సోనియా గాంధీకి పీఏ అని, ఫార్మాలిటీగా రూ. 2 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన యువతి, రూ. 1.08 లక్షలను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసింది. ఆపై అతని సెల్ ఫోన్ పనిచేయక పోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.