Chandrababu: ఎవరి షెడ్యూల్ వారిదే అయినా... నేడు ఇద్దరు చంద్రులూ ఢిల్లీకి!

  • సీజేను కలవనున్న చంద్రబాబు
  • హర్షవర్ధన్ కుమారుని వివాహానికి కేసీఆర్
  • రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా పర్యటనలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖరరావులు నేడు హస్తిన బాట పట్టనున్నారు. ఎవరి షెడ్యూల్ వారిదే అయినప్పటికీ, ఒకేరోజు ఇద్దరు చంద్రులూ న్యూఢిల్లీ పర్యటనకు వెళుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని ప్రారంభించేందుకు అమరావతి రావాలని సీజే రంజన్ గొగొయ్ ని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు.

ఇక కేసీఆర్ విషయానికి వస్తే, ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మహాయాగంలో బిజీగా ఉన్న ఆయన, నేడు జరిగే కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులనూ కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీయేతర పక్షాలు తమతమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న వేళ కేసీఆర్, చంద్రబాబులు ఢిల్లీకి వెళుతుండటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు బీజేపీయేతర పార్టీల నేతలతోనూ, కేసీఆర్ బీజేపీ నేతలనూ తమ పర్యటనల్లో కలవనుండటం గమనార్హం.

Chandrababu
KCR
Harshavardhan
Marriage
  • Error fetching data: Network response was not ok

More Telugu News