Telangana: తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. మొదలైన కౌంటింగ్!
- 75 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారుల వెల్లడి
- 3,701 పంచాయతీ, 28,976 వార్డులకు ఎన్నికలు
- ఈ నెలలోనే మిగిలిన రెండు విడతల పోలింగ్
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిబంధనల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకే గడువు ముగిసినప్పటికీ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. తొలి విడతలో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ పూర్తియినందున అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభించారు.
ఈసారి ఎన్నికల్లో మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో 12,202 మంది సర్పంచ్ లుగా, 70,094 మంది వార్డ్ మెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, మిగిలిన రెండు విడతల పోలింగ్ ను ఈ నెల 25, 30న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.