USA: గోడ కట్టడానికి ఆమోదించండి.. డ్రీమర్లు అమెరికాలో ఉండేందుకు ఛాన్స్ ఇస్తా!: అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన

  • మూడేళ్లు రక్షణ హోదా ఇస్తానని హామీ
  • ప్రతిపాదనను తిరస్కరించిన డెమొక్రాట్లు
  • సరిహద్దు గోడకు రూ.40 వేల కోట్లు ఖర్చు

అమెరికాలో ప్రభుత్వ పాక్షిక షట్ డౌన్ 31 రోజులకు చేరుకోవడంతో ట్రంప్ కొంచెం మెత్తబడ్డారు. డెమొక్రటిక్ పార్టీ నేతలు అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, అమెరికాలో ఉంటున్న 7,00,000 మంది డ్రీమర్ల(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వలస వచ్చినవారు)కు తాత్కాలిక రక్షణ హోదాను మూడేళ్ల పాటు పెంచుతానని ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాలో ఆశ్రయం పొందుతున్న 3 లక్షల మంది విదేశీయులకు దీన్ని వర్తింపజేస్తానని తెలిపారు.

సరిహద్దును సురక్షితంగా మార్చేందుకు 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,678 కోట్లు) ఇవ్వాలని కాంగ్రెస్ ను మరోసారి కోరారు. కాగా, ట్రంప్ ఆఫర్ ను డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తిరస్కరించారు. ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనల వల్ల డ్రీమర్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదనీ, ఇది అమెరికా విలువలకు విరుద్ధమని ప్రకటించారు. డ్రీమర్లకు శాశ్వత రక్షణ కల్పించాలని డెమొక్రాట్లు చాలాకాలంగా కోరుతున్నారు.

షట్ డౌన్ ను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పెలోసీ ట్రంప్ కు సూచించారు. గోడ నిర్మాణానికి డెమొక్రాట్లు ఆమోదం తెలపకపోవడంతో ట్రంప్ వ్యయ బిల్లులపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. దీంతో దాదాపు 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

  • Loading...

More Telugu News