Telangana: పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్.. సెల్ఫీల కోసం ఎగబడిన యువత!
- నాగర్ కర్నూలు జిల్లా మెడిపూర్ వద్ద ఘటన
- 50-60 అడుగుల ఎత్తులో ఎగసిపడ్డ నీరు
- నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం మెడిపూర్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో నాగర్ కర్నూలు- కల్వకుర్తి ప్రధాన రహదారిపై నీళ్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తులో విరజిమ్ముతూ సినిమా సెట్ ను తలపించాయి. నీరు ఉద్ధృతంగా ఎగసిపడటంతో రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పైప్ లైన్ ద్వారా ఎల్లూరు నుంచి కల్వకుర్తికి నీటిని తరలిస్తున్నారు.
కాగా, అచ్చం సినిమా సెట్ లా నీళ్లు గాల్లోకి విరజిమ్మడంతో స్థానికులు భారీగా ఇక్కడకు చేరుకున్నారు. చాలా మంది యువత పోటీపడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. చివరికి ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేసేందుకు సిబ్బందిని పంపారు. గతంలో నిర్మల్ జిల్లాలోని మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో 15 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎగసిపడిన సంగతి తెలిసిందే.