RGIA: చెప్పుల్లో రూ. 66 లక్షల విలువైన బంగారం... పట్టేసిన శంషాబాద్ అధికారులు!
- షార్జా నుంచి ఇండోర్ వచ్చిన వ్యక్తి
- మరో వ్యక్తి ద్వారా హైదరాబాద్ కు బంగారం
- అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు
తన పాదరక్షల అడుగుభాగాన రెండు కిలోల బరువైన బంగారం బిస్కెట్లను తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని హైదరాబాద్, శంషాబాద్ ఆర్జీఐఏ అధికారులు పట్టేశారు. ఈ బంగారం విలువ దాదాపుగా రూ.66.2 లక్షలు ఉంటుందని డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు.
నిన్న ఉదయం షార్జా నుంచి ఓ ప్రయాణికుడు 2 కిలోల బంగారంతో, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో దిగాడని, తన వద్ద ఉన్న బంగారాన్ని ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన వ్యక్తికి అందించాడని వెల్లడించారు. ఆ వ్యక్తి రెండు బంగారం బిస్కెట్లను నాలుగు భాగాలుగా చేసి, తన చెప్పుల అడుగుభాగంలో పెట్టుకున్నాడని, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వేళ, అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, బంగారం బయటపడిందని చెప్పారు.