PV Sindhu: దేశంలో మహిళలకు దక్కుతున్న గౌరవంపై పీవీ సింధు కీలక వ్యాఖ్యలు
- స్త్రీలకు గౌరవం ఇవ్వాలని అందరూ చెబుతారు
- చెప్పిన వారు దానిని ఆచరించడం లేదు
- మన దేశ మహిళలు చాలా ధైర్యవంతులు
దేశంలో మహిళలకు దక్కుతున్న గౌరవంపై హైదరాబాద్ స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు గౌరవం ఇవ్వాలంటూ దేశంలోని ప్రతి ఒక్కరు చెబుతుంటారని, కానీ నిజానికి అలా చెప్పిన వారిలో చాలామంది దానిని పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో మహిళలకు చాలా గౌరవం లభిస్తోందని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. అక్కడ మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పడంతోపాటు వారు దానిని ఆచరిస్తారని తెలిపింది.
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రారంభమైన ‘మీటూ’ ఉద్యమం సమాజాన్ని జాగృతం చేస్తోందని పేర్కొంది. స్త్రీపురుషుల బాధ్యతను ఇది గుర్తుచేసిందని అభిప్రాయపడింది. దేశంలోని మహిళలు చాలా ధైర్యవంతులు, శక్తిమంతులని పేర్కొన్న సింధు.. లైంగిక వేధింపులపై గొంతెత్తుతున్నారని పేర్కొంది. మహిళలు ధైర్యవంతులు కావడం ఎంతో అవసరమని నొక్కి వక్కాణించింది.