Kerala: శబరిమల విషయంలో విజయం సాధించలేకపోయాం: బీజేపీ కీలక వ్యాఖ్యలు
- భక్తుల మనోభావాలను కాపాడలేకపోయాం
- ఇక నిరసనలను ముగించనున్నాం
- కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై
శబరిమల విషయంలో బీజేపీ చేపట్టిన నిరసనలు పూర్తిగా విజయవంతం కాలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు ఎస్ శ్రీధరన్ పిళ్లై కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలను కాపాడటంలో తాము విఫలమయ్యామని ఆయన అన్నారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత దాదాపు మూడు నెలలకు పైగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.
భక్తులు, హిందూ సంఘాలు కలిసిరావడంతో నిరసనలు ఉద్ధృతంగానే సాగాయి. అయినప్పటికీ, ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. ఇప్పటివరకూ 51 మంది మహిళలు ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించుకున్నారని స్వయంగా కేరళ సర్కారు ప్రకటించగా, భక్తులు మాత్రం ఇద్దరు మహిళలే స్వామిని దర్శించుకున్నారని అంటున్నారు.
కాగా, పార్టీ చేపట్టిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధరన్ మాట్లాడుతూ, అయ్యప్ప ఆలయం నిరవధికంగా మూతపడనున్న నేపథ్యంలో, నిరసనలను ముగించనున్నామని అన్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 100 శాతం అడ్డుకోలేకపోయామని, అయితే, ప్రజలు, అయ్యప్ప భక్తుల మద్దతు తమకు లభించిందని ఆయన అన్నారు.