Andhra Pradesh: చంద్రబాబు ఇన్నాళ్లూ ఓటర్లను కొన్నారు.. ఇప్పుడు పార్టీలను కొంటున్నారు!: వైసీపీ నేత సజ్జల ఎద్దేవా
- ఏపీని కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయి
- జగన్ జాతీయ రాజకీయాలపై మాట్లాడలేదు
- కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాం
ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు మోసం చేశాయని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం నిర్మిస్తానని జగన్ ఎన్నడూ చెప్పలేదన్నారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేపొద్దున చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోటీ అని చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు చంద్రబాబును కోల్ కతా కు పిలిచింది ఎవరో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని సజ్జల స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిలబడి ‘తెలుగుజాతిని ఎవ్వరూ అడ్డుకోలేరు’ అని ప్రకటనలు ఇవ్వడం, దాన్ని ఈనాడు పేపర్ రాయడం ఎన్టీఆర్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ ఓటర్లను కొన్నారనీ, ఇప్పుడు పార్టీలను కొనే స్థాయికి ఎదిగారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్ విగ్రహం ముందు చంద్రబాబు వినమ్రంగా నిలబడి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం బాధాకరమన్నారు. చంద్రబాబు మంద బలంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ ను ఎగతాళి చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంటే సంజీవినా? అని ఎదురుదాడి చేశారని గుర్తుచేశారు. ఎన్నికలు సమీపించడంతో మోదీతో వెళితే ఓడిపోతామని భావించిన చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని స్పష్టం చేశారు.
తెలంగాణలో రెండోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక హోదా నినాదానికి కేసీఆర్ మద్దతు ఇవ్వడం, అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని చెప్పడంతో వైసీపీ హర్షం వ్యక్తం చేసిందన్నారు. జగన్–కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు మితిమీరి ఇష్టారాజ్యంగా, ఉన్మాదుల మాదిరిగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన బావమరిది హరికృష్ణ శవం వద్ద కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడారని తెలిపారు. ఈ రోజు వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నామని చెప్పారు. 2014లోనే బీజేపీ నుంచి తమకు ఆహ్వానం వచ్చిందనీ, అయినా తాము వెళ్లలేదని గుర్తుచేశారు.