Telangana: జీఎస్టీ వసూలులో దేశానికే ఆదర్శంగా నిలిచాం.. ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి!: గవర్నర్ నరసింహన్

  • సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
  • సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచాం
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందని వ్యాఖ్యానించారు. రెండోసారి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. విద్యుత్ కోతలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తొలివిజయం సాధించిందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు అనుమతుల జారీలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.

వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వసూలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుందని చెప్పారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించామనీ, మిషన్‌ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు  భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రైతు బంధు పథకాన్ని దేశంలోని ఆర్థిక వేత్తలు, వ్యవసాయ వేత్తలు ప్రశంసించారని గుర్తుచేశారు. ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నామనీ, గద్వాలలో టెక్స్ టైల్ హబ్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

‘తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలను సాకారం చేశాం. కంటి వెలుగు ద్వారా ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నాం. పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. స్థానికులకే ఉద్యోగాలు దొరికేలా జోన్ల సంఖ్య, రిజర్వేషన్లను పెంచాం. ప్రభుత్వం అమలుచేస్తున్న పారదర్శక విధానాల కారణంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా 4,000 పరిశ్రమలకు అనుమతులు జారీ చేశాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే ప్రజలు రెండోసారి టీఆర్ఎస్ ను ఆదరించారు. బంగారు తెలంగాణ దిశగా పునరంకితం అవుదాం’ అంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

Telangana
governer
speach
esl narasimhan
gst
solar power
  • Loading...

More Telugu News