Andhra Pradesh: వరంగల్ లో తనపై రాళ్లు విసిరిన వాళ్లతోనే జగన్ చేతులు కలిపాడు!: చంద్రబాబు
- కోల్ కతా ర్యాలీకి 20 పార్టీల హాజరు
- జగన్, కేసీఆర్ రావడంలేదు
- టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
కోల్ కతాలో నేడు జరగనున్న విపక్షాల ర్యాలీకి 20కి పైగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరు అవుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం రాలేదనీ, వారిద్దరూ మోదీతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతల ఆంధ్రా వ్యతిరేక వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, వారితో అంటకాగుతున్న జగన్ వైఖరిని ఎండగట్టాలని సూచించారు. ర్యాలీ కోసం ఇప్పటికే కోల్ కతా చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలతో ‘ఎలక్షన్-2019 మిషన్’ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అసలు లేదనీ, అది శూన్యం మాత్రమేనని స్పష్టం చేశారు. మోదీ కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్నారు. వరంగల్ లో తనపై రాళ్లు విసిరిన నేతలతోనే ఇప్పుడు జగన్ చేతులు కలుపుతున్నారని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం దేశంలో అశాంతిని రెచ్చగొడుతోందనీ, శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందనీ, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.