Telangana: పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రలోభాల పర్వం.. మద్యం, నగదు పంపిణీలో పోటాపోటీ

  • అసెంబ్లీ ఎన్నికలకు దీటుగా మద్యం పంపిణీ
  • అంబులెన్సులలో మద్యం సరఫరా
  • విందు రాజకీయాలకు వేదికగా మామిడి తోపులు

పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రలోభాల పర్వం మొదలైంది. ఈ నెల 21న మొదటి విడత  పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో మద్యం, నగదు పంపిణీ జోరందుకుంది. ఇక, విందు రాజకీయాలకైతే లెక్కే లేదు. విందు రాజకీయాలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సర్పంచ్ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోట పంచాయతీలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా అంబులెన్స్‌నే ఉపయోగించుకున్నాడు. అందులో పెద్ద ఎత్తున మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

మెదక్ జిల్లాలో అయితే కొందరు అభ్యర్థులు తోటల్లో ఓటర్లకు మాంసాహారంతో భోజనాలు పెడుతూ కావాల్సినంత మందు పోస్తున్నారు.  నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లోని మామిడితోపులు కూడా విందులకు వేదిక అవుతున్నాయి. ఇక, మరికొందరు అభ్యర్థులైతే రూ. 500కు తక్కువ కాకుండా ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.  

తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే ఏకంగా రూ. 4.26 లక్షల విలువైన వెయ్యి లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 14 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.85 వేలు, ఖమ్మంలో రూ.83,180 నగదును పట్టుకున్నారు. ఖమ్మంలో ఇప్పటి వరకు  రూ.1.18 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.2.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1.22 కోట్ల నగదు పట్టుబడగా,  62 కేసులు నమోదు అయ్యాయి. కాగా, తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.

Telangana
Panchayat polls
Hyderabad
Liquor
cash
Elections
  • Loading...

More Telugu News