gajwel: వంటేరు ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారు: కేటీఆర్ ప్రశంస

  • గజ్వేల్ లో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది
  • ఈ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోంది
  • మెదక్ పార్లమెంట్ స్థానంలో మా మెజారిటీ పెరుగుతుంది

వంటేరు ప్రతాప్ రెడ్డి ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. వంటేరు ప్రతాప్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో వంటేరు చేరికతో గజ్వేల్ లో తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని అన్నారు.

వంటేరు కలిసి రావడంతో మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ పార్టీ మెజారిటీ పెరుగుతుందని, ఇదే స్ఫూర్తితో ఖమ్మం, ఇతర ఎంపీ సీట్లను పెద్ద మెజార్టీతో గెలవాలని పిలుపు నిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని, రెండోసారి కూడా గజ్వేల్ ప్రజలు అఖండ మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ట్రక్కు గుర్తు వాళ్లు తమ ఓట్లన్నీ ఎత్తుకెళ్లారని, లేకపోతే, వందసీట్లు సాధించేవాళ్లమని అన్నారు.

గజ్వేల్ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోందని, ఇక్కడి రైతులు మూడు పంటలు పండించుకునే రోజు రాబోతోందని కేటీఆర్ అన్నారు. వేములఘాట్, మల్లన్నసాగర్ నిర్మాణానికి ఆటంకాలు లేవని, ‘కోటి ఎకరాల మాగాణం’ అనే స్వప్నం త్వరలో సాకారం కాబోతోందని చెప్పారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు నీళ్లివ్వబోతున్నట్టు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ  వంద సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదు

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ  వంద సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, ‘బిల్డప్ జనతా పార్టీ’ అని అభివర్ణించారు. బీజేపీ చెప్పే దాంట్లో నిజం లేదని, పైన పటారం లోన లొటారం అని, ఒకవేళ కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా 270 స్థానాలు గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News