India: 100 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్!
- వరుణుడి కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆఖరి వన్డే
- ఓపెనర్లను అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్
- ఖావాజా, మార్ష్ లను పెవీలియన్ కు పంపిన చాహాల్
భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా టాపార్డర్ కుప్పకూలింది. వరుణుడి కారణంగా ఈ ఉదయం కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైన ఆఖరి వన్డేలో టాస్ ఓడిపోయి, బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టులో ఓపెనర్లు ఏటీ కార్వే, 5 పరుగులకు, ఏజే ఫించ్ 14 పరుగులకు అవుట్ అయ్యారు. ఈ రెండు వికెట్లను భువనేశ్వర్ కుమార్ తన ఖాతాలో వేసుకోగా, ఆపై ఉస్మాన్ ఖావాజా, ఎస్ఈ మార్ష్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు.
ఈ క్రమంలో జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ఉన్న వేళ 39 పరుగులు చేసి దూకుడుగా ఉన్న ఎస్ఈ మార్ష్ ను చాహల్ పెవీలియన్ కు పంపాడు. చాహల్ వేసిన బంతిని మార్ష్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. ఆపై రెండు బంతుల వ్యవధిలోనే 34 పరుగులు చేసిన ఖావాజాను కాట్ అండ్ బౌల్డ్ గా చాహల్ అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ 4 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం హాండ్స్ కోంబ్ 7 పరుగులతో, మార్కస్ స్టోయిన్స్ 2 పరుగుతో క్రీజులో ఉండగా, ఆసీస్ స్కోరు 26 ఓవర్లలో 109/4.