Sushil Modi: నచ్చనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకయ్యా.. బయటకు పోవచ్చుగా!: శత్రుఘ్న సిన్హాపై సుశీల్ మోదీ మండిపాటు
- గత కొంతకాలంగా బీజేపీపై సిన్హా విమర్శలు
- ప్రతిపక్ష నేతలపై ప్రశంసలు
- దమ్ముంటే పార్టీని వీడి పోటీ చేయాలని సవాలు
సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ విరుచుకుపడ్డారు. పార్టీ అంటే నచ్చనప్పుడు అందులో ఉండడం దేనికని ప్రశ్నించారు. యశ్వంత్ సిన్హాతో కలిసి ఆయన పాడైపోయారని ఆరోపించారు. ‘‘శత్రుఘ్న సిన్హా అంటే నిజానికి నాకెంతో ఇష్టం. కానీ ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండడం నచ్చలేదు. నచ్చని పార్టీలో ఉండడం దేనికి? పార్టీని వదిలేయొచ్చుగా. తనను మంత్రిని చేసిన పార్టీపై ఆయన వాడుతున్న భాష ఏమంత సంస్కారంగా లేదు’’ అని సుశీల్ మోదీ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా పార్టీపై సిన్హా విషం కక్కుతున్నారని పేర్కొన్న సుశీల్ మోదీ.. ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి ప్రశంసిస్తున్నారన్నారు. ఇటీవల బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్‌ను కలిసి ఆయన కుమారుడే బీహార్ కాబోయే సీఎం అని ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. సిన్హాకు ప్రజల్లో అంతా పాప్యులారిటీనే ఉంటే వెంటనే పార్టీకి రాజీనామా చేసి పాట్నా సాహిబ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని సవాలు చేశారు. తాను బీజేపీలోనే పుట్టానని, బీజేపీలోనే మరణిస్తానని ఈ సందర్భంగా సుశీల్ మోదీ పేర్కొన్నారు.