YSRCP: చీకటి ఒప్పందాలు చేసుకునే అలవాటు చంద్రబాబుకే ఉంది: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- కేటీఆర్ ని జగన్ కలిస్తే తప్పేంటి?
- పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
- ఈ సామెత టీడీపీకి కరెక్టుగా సరిపోతుంది
చీకటి ఒప్పందాలు చేసుకునే అలవాటు చంద్రబాబుకే ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కేటీఆర్ ని జగన్ కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ-టీఆర్ఎస్ ల కలయికపై ఇప్పటికే టీడీపీ నేతలు పలు విమర్శలు చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ, పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత తెలుగుదేశం పార్టీ నాయకులకు కరెక్టుగా సరిపోతుందని అన్నారు.
ఎందుకంటే, చీకటి ఒప్పందాలు, ఎవరితోబడితే వారితో పొత్తులు పెట్టుకునే అలవాటు చంద్రబాబునాయుడుకి, ఆయన పార్టీకి ఉందన్న విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసని విమర్శించారు. చంద్రబాబు ఈ రోజున పొత్తుపెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీయేనని, ఒకప్పుడు బీజేపీతో, మొన్న కాంగ్రెస్ పార్టీతో, 2009లో కేసీఆర్ తో చంద్రబాబు ఎలా పొత్తులు పెట్టుకున్నారో అందరూ చూశారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పినప్పటికీ, బీజేపీతో వైసీపీ కలిసిపోయిందని బురద జల్లడం లేదా కేసీఆర్ తో కలిసిపోయామనో బురద జల్లడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు, ఓటమి భయం ఎంతగా పట్టుకుందనడానికి నిదర్శనమని అన్నారు.