cricodail attack: పెంపుడు మొసలే పొట్టన పెట్టుకుంది...మహిళా శాస్త్రవేత్త బలి
- ఇండోనేషియాలో ఘటన
- యజమానురాలి ఓ చేతిని, పొట్టభాగాన్ని తినేసిన మొసలి
- మరునాడు గుర్తించిన సహోద్యోగులు
‘పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది’...అంటారు పెద్దలు. క్రూర జంతువులను పెంచుతున్నా వాటితో ఎప్పటికైనా ప్రమాదం పొంచే ఉంటుంది. ఇందుకు ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణ. తను ముద్దుగా పెంచుకుంటున్న మొసలి దాడి చేయడంతో నలభై నాలుగేళ్ల ఓ మహిళా శాస్త్రవేత్త బలైంది.
వివరాల్లోకి వెళితే...ఇండోనేషియాకు చెందిన ఈ శాస్త్రవేత్త తన ఇంటి ఆవరణలోని మడుగులో ఓ మొసలిని పెంచుతోంది. దీని పొడవు 14 అడుగులు. స్వహస్తాలతో ఆహారం, మందులు అందించి దాన్ని అల్లారుముద్దుగా పెంచుకునేది. ఏమైందో ఏమో పెంచిన యజమానురాలిపైనే ఆ మొసలి దాడిచేసింది. ఆమెను చంపేసి ఒక చేతిని, ఉదర భాగాన్ని పూర్తిగా తినేసింది.
గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని తోటి సిబ్బంది మరునాడు ఆమె ఇంటి ఆవరణలో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. వైద్యులు, ఆర్మీ, పోలీసుల సాయంతో సదరు మొసలిని శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.