Karnataka: కుమారస్వామి ప్రభుత్వానికి మరో షాక్.. నేడు కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్న పలువురు ఎమ్మెల్యేలు?
- కర్ణాటకలో మరోమారు రాజకీయ వేడి
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు రాజీనామా అంటూ ప్రచారం
- తమకొచ్చిన ముప్పేమీ లేదన్న కుమారస్వామి
కన్నడ రాజకీయాలు గత రెండు రోజులుగా పలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మొదలైన వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు నేడు రాజీనామా చేయనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో మరోసారి కలకలం రేగింది.
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి ‘నియంత్రణ’లోనే ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారంటూ కాంగ్రెస్-జేడీఎస్ చేసిన ఆరోపణలపై బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప స్పందించారు. అధికార పార్టీనే ఆ పనిచేస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి తమవైపు తిప్పుకుంటోందన్నారు.