KA Paul: నేను అవినీతికి పాల్పడితే కేసులు వేసుకోండి.. బీజేపీకి కేఏ పాల్ ఓపెన్ చాలెంజ్

  • మోదీకి నా కంటే సన్నిహితులు మరెవరూ ఉండరు
  • అదే జరిగితే జగన్‌కు డిపాజిట్లు కూడా రావు
  • వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ మూడూ ఒక్కటే 

తాను అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తున్న బీజేపీ ఈ విషయంలో కేసులు వేసుకోవచ్చని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి తనకంటే సన్నిహితులు ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో తాను బీజేపీకి మద్దతు ఇస్తానంటే సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ వద్దని అన్నారని గుర్తు చేశారు. మోదీ తననే మోసం చేశారని, ఆయనను నమ్మొద్దని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇటువంటి మోసపూరిత రాజకీయాలే ఏపీలోనూ నడుస్తున్నాయన్నారు.  

జగన్-కేటీఆర్ కలయికపై పాల్ మాట్లాడుతూ.. జగన్ తరపున కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే జగన్‌కు డిపాజిట్లు కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ప్రజాశాంతి పార్టీయేనని, సీఎంను తానేనని జోస్యం చెప్పారు. జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నట్టు రుజువైందని, ఆయనపై 12 ఈడీ కేసులు ఉన్నాయని విమర్శించారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఒకటేనన్నారు. గతంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిసినప్పుడు టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వమని తనను అడిగారని పేర్కొన్న పాల్.. అప్పట్లో ఆయన అలా ఎందుకు అడిగారో అర్థం కాలేదని, ఇప్పుడు మాత్రం ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చిందని పాల్ వివరించారు.

  • Loading...

More Telugu News