Andhra Pradesh: రాజకీయాల్లో రంకులు, బొంకులు దాగవు.. నాలుగేళ్లుగా సాగిన ఈ రంకు రాజకీయాలు ఇప్పుడు బయటపడ్డాయి!: దేవినేని ఉమ

  • తెలంగాణ ఏపీ విద్యుత్ బిల్లులు కట్టలేదు
  • ఏపీని పాలించడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
  • సొంత నేతలను టీఆర్ఎస్ లోకి పంపారు

పోలవరాన్ని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ నేతలు చేయని కుట్రలు, కుతంత్రాలు లేవని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు ఒడిశాతో చేతులు కలిపి అడ్డంకులు కల్పించారని వ్యాఖ్యానించారు. సుమారు రూ.5,200 కోట్ల ఏపీ విద్యుత్ ను తెలంగాణ వాడుకుందనీ, అయినా బిల్లును ఇంకా చెల్లించలేదనీ, అడిగితే దిక్కు ఉన్నచోట చెప్పుకోండి అని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. ఏపీ స్థానికత ఉన్న 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు రోడ్డుపైకి పంపేస్తే జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ పండుగ దినాన కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని విమర్శించారు. అధికారం కోసం కక్కుర్తి పడి, ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి జగన్ కేసీఆర్ తో చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పాదయాత్రలోనే వైసీపీకి ఏపీ ప్రజలు ముగింపు పలికారని ఎద్దేవా చేశారు. అందుకే చివరి అస్త్రంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి జగన్ పూనుకున్నారని దుయ్యబట్టారు.

 రిమోట్ కంట్రోల్ గా జగన్ ను ఇక్కడ పెట్టుకుని ఏపీ ప్రజల మీద పెత్తనం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఖబడ్ధార్ ఆంధ్రా ద్రోహుల్లారా.. ఖబడ్ధార్ అని హెచ్చరించారు. రాష్ట్ర విభజన తర్వాత చెట్ల కింద తాము పరిపాలన చేశామని అన్నారు. ప్రజల రాజధాని అమరావతి జగన్ కు మాత్రం భ్రమరావతిగా మారిందని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు రమ్మంటే జగన్ ఆహ్వాన పత్రికను కూడా తీసుకోలేదని తెలిపారు.

  ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తామని చంద్రబాబు చెప్పారని ఉమ గుర్తుచేశారు. అందువల్లే ఈరోజు పోలవరం కల సాకారం అయిందని తెలిపారు. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నాడని కేసీఆర్ తిట్టారనీ, అలాంటి వ్యక్తితో కలిసి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

2014లో వైసీపీ టికెట్ పై గెలిచిన అభ్యర్థులను జగన్ టీఆర్ఎస్ లోకి పంపారని ఆరోపించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లజెండా ఎత్తి టీఆర్ఎస్ కు సహకరించారని దుయ్యబట్టారు. ఈరోజు నిస్సిగ్గుగా పండుగ రోజున బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రంకులు, బొంకులు దాగవనీ, గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ రంకు, బొంకు రాజకీయాలు ఇప్పుడు బయటపడ్డాయని చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
devineni
uma
Jagan
KCR
YSRCP
TRS
Telangana
Telugudesam
  • Loading...

More Telugu News