kcr: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రెండో ఆలోచన లేదు: కేటీఆర్
- ఏపీకి హోదా ఇవ్వాలన్న అప్పటి ప్రధాని హామీని నెరవేర్చాల్సిందే
- పార్లమెంటులో కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం
- జగన్ ని కలసి కేసీఆర్ అన్ని విషయాలు చెబుతారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్పష్టతను ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.కేశవరావు, లోక్ సభలో ఎంపీ కవితతో పాటు పలు వేదికలపై తాము స్పెషల్ స్టేటస్ పై తమ వైఖరిని స్పష్టం చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు... అది నెరవేర్చాలని చెప్పామని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని... ఇందులో రెండో అభిప్రాయం లేదని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ తో ఇది ప్రారంభ సమావేశం మాత్రమేనని... ఏపీకి కేసీఆర్ వెళ్లి జగన్ తో అన్ని విషయాలపై లోతుగా మాట్లాడతారని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలో కేసీఆర్ చెబుతారని తెలిపారు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే... ఆ తర్వాత చెప్పడానికి మరేమీ ఉండదని మీడియాతో చలోక్తి విసిరారు.