Telangana: తెలంగాణలో కాంగ్రెస్ కు ఝలక్.. ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్!
- రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిపై అనర్హత వేటు
- ఇప్పటికే నేతల వివరణ కోరిన చైర్మన్ స్వామిగౌడ్
- ఇంకా స్పందించని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు శాసనమండలి సభ్యులపై వేటు పడింది. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డిపై వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కొరడా ఝుళిపించారు. ఇప్పటికే ఈ ముగ్గురు నేతలకు సంబంధించిన వివరణలు తీసుకున్న ఆయన.. తాజాగా నిబంధనల మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ స్పందించలేదు.