Maha Guida: గత జన్మలో మనమ్మాయేనేమో... నాలుగు భారతీయ భాషలు మాట్లాడే ట్యునీషియా యువతిపై సుష్మా స్వరాజ్ ప్రశంసలు!

  • 'భారత్ కో జానీయే' క్విజ్ ఫైనలిస్టుల్లో మహా గైడా
  • మహా కళ్లల్లో భారతీయతత్వం కనిపిస్తోందన్న సుష్మా
  • మలయాళం, తమిళం, హిందీ, ఉర్దూ మాట్లాడగల మహా

మహా గైడా (31) హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళ భాషలు తెలిసిన ట్యునీషియా యువతి. 'భారత్ కో జానీయే' క్విజ్ కార్యక్రమం ఫైనలిస్ట్. ఈమె ప్రతిభను తెలుసుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పొగడ్తలు కురిపించారు. "ఆమె తన గత జన్మలో భారతీయురాలు" అని సుష్మ అన్నారు. ఇండియాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మహా, ట్యునీషియా, ఇండియాల మధ్య ఎంతో స్నేహబంధముందని, తనకు ఇండియాలో పర్యటించే అవకాశం ఇచ్చినందుకు సుష్మకు కృతజ్ఞతలని అన్నారు. తాను ఈ పోటీలో విదేశీ కేటగిరీలో పాల్గొన్నానని, గతంలో నాలుగు సార్లు ఇండియాను సందర్శించానని, ఈ దేశం తనకెంతో ఇష్టమని అన్నారు.

ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగిన క్విజ్ పోటీలకు అతిథిగా వచ్చిన సుష్మ ప్రసంగిస్తూ, విదేశాంగ శాఖ నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఈ క్విజ్ పోటీలు తనకెంతో ఇష్టమని అన్నారు. "మహా, నువ్వు గత జన్మలో ఇండియన్ అయ్యుంటావు. మేము గతజన్మ ఉందని నమ్ముతాం. నువ్వు మాట్లాడే భాషలో, నీ కళ్లలో భారతీయతత్వం, దేశంపై ప్రేమ కనిపిస్తోంది" అని అన్నారు. ఆపై మీడియాతో మాట్లాడిన మహా, తాను కథాకళి నేర్చుకున్నానని, బాలీవుడ్ సినిమాలు, దక్షిణాది సినిమాలంటే ఎంతో ఇష్టమని, షారూక్ ఖాన్, తమిళ నటుడు విజయ్ లకు తాను అభిమానినని వ్యాఖ్యానించారు. హిందీ నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లో బాలీవుడ్ చిత్రాలను చూసేదాన్నని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News