Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి షాక్.. బీజేపీ గూటికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు!
- గవర్నర్ కు లేఖరాసిన శంకర్, నాగేశ్
- తమకు ఇబ్బందేమీ లేదన్న కాంగ్రెస్
- బీజేపీ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప భేటీ
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈరోజు ప్రకటించారు. తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్ కు లేఖ రాశారు. మరోవైపు బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ ముంబైలోని హోటల్ లో బస కల్పించింది.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నాగేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్లు గవర్నర్ కు ఈరోజు లేఖ రాశారు. ఇటీవల ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీి నేతలతో చర్చలు జరిపారన్న ఆరోపణలతో శంకర్ ను కుమారస్వామి మంత్రివర్గం నుంచి తప్పించారు. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్ లో ఉన్నారని పేర్కొంది.
కాగా, బీజేపీకి చెందిన 103 మంది ఎమ్మెల్యేలతో మాజీ సీఎం యడ్యూరప్ప ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మొత్తం 224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 118 మంది సభ్యులు వున్నారు. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎవరికైనా 113 స్థానాలు అవసరం.