YSRCP: షర్మిళ సాక్ష్యాధారాలతో ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలి: టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్
- ఆంధ్రా పార్టీ, ఆంధ్రా నాయకురాలు షర్మిళ
- మరి, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు
- నాడు మాపై దుష్ప్రచారం చేస్తే సాక్ష్యాలతో పోలీస్ వద్దకు వెళ్లాం
సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరిగిందంటున్న వైసీపీ నాయకురాలు షర్మిళ తగిన సాక్ష్యాధారాలు తీసుకు వచ్చి ఏపీ పోలీసులకు ఇవ్వాలని ఏపీ టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రా పార్టీ, ఆంధ్రా నాయకురాలు అయిన షర్మిళ, ఈ విషయమై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. జగన్ పై దాడి కేసు కూడా హైదరాబాద్ లోనే నమోదు చేశారని విమర్శించారు.
సాక్ష్యాధారాలతో సహా ఆమె ఏపీ పోలీసులకు వద్దకు వస్తే వారు దర్యాప్తు చేస్తారని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపైన, తమ పార్టీపైన ఈ విధంగానే దుష్ప్రచారం చేసినప్పుడు తాము సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తమపై దుష్ప్రచారం చేసిన నిందితులకు వైసీపీ తరపు లాయర్ల ద్వారా వారికి బెయిల్ వచ్చిందని, వారికి పూచీకత్తులుగా వైసీపీ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీపైన, తమ నాయకులపైన సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దుష్ప్రచారాలకు వైఎస్ జగన్ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.