Telangana: ఎన్నికల ఖర్చు ఇంతే... గజ్వేల్ లో కేసీఆర్ ఖర్చు రూ. 6.53 లక్షలు, కొడంగల్ లో రేవంత్ వ్యయం రూ. 7.40 లక్షలు!
- ఎన్నికల్లో ఖర్చు లెక్కలను ఈసీకి సమర్పించిన అభ్యర్థులు
- తలసరి ఖర్చు ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేదు
- సిరిసిల్లలో కేటీఆర్ పెట్టిన ఖర్చు రూ. 7.53 లక్షలు
గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల సగటు వ్యయం ఈసీ పరిమితి దరిదాపులకు కూడా చేరలేదట. ఒక్క ప్రాంతంలోనూ మద్యం, నగదు పంపిణీ లేదట. అసలు ఈ అసెంబ్లీ ఎన్నికలు కారు చౌకగా సాగాయట. ఎన్నికలు ముగిసిన తరువాత అభ్యర్థులంతా తమ తమ ఖర్చు లెక్కలను ఈసీకి అందించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ రూ. 6.53 లక్షలు ఖర్చు చేశారట. ఇక, హై టెన్షన్ ను తలపించిన కొడంగల్ లో రేవంత్ రెడ్డి చేసిన ఖర్చు రూ. 7.40 లక్షలు మాత్రమేనట. త్రిముఖ పోటీ నెలకొన్న సూర్యాపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి, తాను రూ. 16 లక్షలు ఖర్చు చేశానని లెక్క చూపారు. టీఆర్ఎస్ యువనేత కేటీఆర్, సిరిసిల్లలో రూ. 7.53 లక్షలు ఖర్చు చేశానని చెప్పగా, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ. 17.06 లక్షలు ఖర్చు పెట్టారట.
ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనవంతుడు, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్, నాగర్ కర్నూలులో రూ. 17.77 లక్షలు ఎన్నికల వ్యయాన్ని చూపగా, తుమ్మల నాగేశ్వరరావు రూ. 14.44 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఎన్నికల ఖర్చులో క్వార్టర్ మద్యం బాటిల్ కొన్నట్టు కూడా చూపించలేదు. పంచాయతీ సర్పంచ్ పదవి కోసం రూ. 50 లక్షలు ఖర్చు పెట్టాల్సిందేనని ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు అంత తక్కువంటే నమ్మాలో, వద్దో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే.