Andhra Pradesh: శ్రీనివాసరావును ఇంకా విచారించని ఎన్ఐఏ అధికారులు.. కారణాన్ని తెలిపిన లాయర్ సలీం!
- బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ సెంటర్ లో శ్రీనివాసరావు
- సరైన ప్రాంతం కాదని భావిస్తున్న అధికారులు
- మరోచోటికి తరలించేందుకు అధికారుల ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విశాఖలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈరోజు శ్రీనివాసరావును విచారించాలని నిర్ణయించిన అధికారులు ఆయన లాయర్ అబ్దుల్ సలీంకు నిబంధనల మేరకు సమాచారం అందించారు. తాజాగా న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఐఏ అధికారులు ఈరోజు నిందితుడు శ్రీనివాసరావును విచారించలేదని తెలిపారు. శ్రీనివాసరావును విచారించేందుకు బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సరైన ప్రాంతం కాదని అధికారులు భావిస్తున్నట్లు చెప్పారు.
అందువల్ల నిందితుడిని విచారణ కోసం మరో ప్రాంతానికి తరలించడానికి ఉన్నతాధికారుల అనుమతిని కోరారని పేర్కొన్నారు. అనుమతులు లభించిన వెంటనే శ్రీనివాసరావును హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి తరలిస్తారని స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భుజానికి లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.