Mumbai: బోర్ కొట్టిందట... ఇళ్లకు నిప్పెట్టి, పోలీసులకు ఫోన్ చేసిన ఫైర్ ఫైటర్!
- ముంబైలో గత నెలలో ప్రమాదాలు
- నిందితుడిని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
- విచారణలో నిందితుడు చెప్పింది విని అవాక్కు
బోర్ కొడితే ఎవరైనా సినిమాకు వెళతారు, వీడియో గేమ్స్ ఆడతారు, బైక్ పై సరదాగా తిరిగి కాలక్షేపం చేస్తారు. కానీ, ముంబైలోని ఓ కుర్రాడు మాత్రం ఏకంగా ఇళ్లకు నిప్పు పెట్టడం ప్రారంభించాడు. పైగా అతడు వాలంటీర్ ఫైర్ ఫైటర్ కావడం గమనార్హం. గత నెల 3వ తేదీ, ఆపై 10వ తేదీల్లో ముంబైలోని ఇళ్లు ఉన్నట్టుండి దగ్ధమైన సంగతి తెలిసిందే.
ఈ కేసును విచారించిన పోలీసులు ర్యాన్ లుభం (19) అనే యువకుడిని నిందితుడిగా తేల్చారు. అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపకశాఖతో కలసి రంగంలోకి దిగి మంటలు ఆర్పుతూ అందరి మన్ననలూ పొందే ర్యాన్ ను విచారించిన పోలీసులు, అతను చెప్పిన కారణాన్ని విని విస్తుపోయారు. తనకు బోర్ కొట్టిందని, అందువల్లే ఇళ్లకు నిప్పంటించానని విచారణలో చెప్పాడట.
పైగా, నిప్పంటించిన తరువాత, అతనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చాడని కూడా తేల్చారు. సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, ర్యాన్ పై అనుమానం వచ్చి అరెస్ట్ చేసి, నిజాన్ని తేల్చారు. కాగా, ఫైర్ ఫైటర్లే ఇలా నిప్పంటించడం ఇదే తొలిసారేమీ కాదు. అమెరికా సహా పలు దేశాల్లో ప్రతియేటా సుమారు వంద మందికి పైగా ఫైర్ ఫైటర్లు ఇలా నిప్పంటించిన కేసుల్లో అరెస్టవుతున్నారు.