Facebook: ఫేస్‌బుక్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన నివేదిక
- 2012లోనే డేటాను విక్రయించాలని నిర్ణయం
- 2014లో నిర్ణయాన్ని మార్చుకున్నారు
- అనుమతులు పెంచుతూ రాబడి కోసం యత్నం
గత ఏడాది తమ వినియోగదారుల డేటా లీకేజీ ఉదంతంతో చిక్కుల్లో పడ్డ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌కు సంబంధించి మరొక సంచలన విషయాన్ని ఓ నివేదిక వెల్లడించింది. 2012లోనే ఫేస్బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని విక్రయించే అంశం గురించి ఆలోచించిందని ఆ నివేదిక పేర్కొంది. కానీ తర్వాత దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.
కనీసం 2,50,000 డాలర్లకు తమ వినియోగదారుల ప్రాథమిక వివరాలను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని 2012లోనే ఫేస్బుక్ సిబ్బంది భావించారని.. కానీ 2014లో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని నివేదిక స్పష్టం చేసింది. వాల్‌స్ట్రీట్ జనరల్ కూడా తను ప్రచురించిన కథనంలో... వినియోగదారుల సమాచారాన్ని వినియోగించుకొనేందుకు అనుమతులు పెంచుతూ ప్రకటన కర్తల నుంచి మరింత రాబడి పొందవచ్చనే అంశంపై ఫేస్బుక్ ఉద్యోగులు చర్చలు జరిపినట్టు పేర్కొంది.