kanakadurga: శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఇద్దరు మహిళలు ఎక్కడున్నారు?
- జనవరి 2న ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ
- ఆందోళనకారుల నుంచి బెదిరింపులు
- గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయిన మహిళలు
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత... అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా బిందు (40), కనకదుర్గ (39)లు చరిత్ర సృష్టించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో... వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత వారు ఇప్పటి వరకు వారి ఇంటికి కూడా వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో... వారు బయటకు రావడం లేదు.
ప్రస్తుతం వారిద్దరూ ఎక్కడున్నారో ఎలాంటి సమాచారం లేదు. అయితే గుర్తు తెలియని ప్రదేశం నుంచి వారు ఓ మీడియా సంస్థతో మాట్లాడినట్టు సమాచారం. పోలీసులపై తమకు నమ్మకం ఉందని... తమకు వారు రక్షణ కల్పిస్తారనే విశ్వాసం ఉందని వారు మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే వారం వారిద్దరూ తమ ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. జనవరి 2వ తేదీ తెల్లవారుజామున వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు.