Dalit woman: 50 ఏళ్ల మహిళలా కనిపించేందుకు జుట్టుకు గ్రే కలర్ డై వేసుకుని అయ్యప్ప ఆలయంలోకి వెళ్లా!: 36 ఏళ్ల దళిత మహిళ ప్రకటన
- ఫొటోతో సహా పోస్టు చేసిన మంజు
- గతేడాది విఫలయత్నం
- శబరిమలలో మరో కలకలం
శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారన్న వార్తలతో గతవారం కేరళ అట్టుడికింది. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ ఆలయంలోకి ప్రవేశించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా 36 ఏళ్ల దళిత మహిళ సంచలన ప్రకటన చేసింది. 50 ఏళ్ల మహిళలా కనిపించేందుకు జుట్టుకు గ్రే కలర్ డై వేసుకుని శబరిమల ఆలయంలోకి ప్రవేశించానని 36 ఏళ్ల పి.మంజు తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. అంతేకాదు, అయ్యప్పను దర్శించుకుంటున్న ఫొటోను కూడా పోస్టు చేసింది. అయితే, ఆ ఫొటోలు నిజమైనవో, కావో పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
తాను పోలీసు రక్షణ కోరలేదని, ఇతర భక్తులతో కలిసే వెళ్లానని ఆమె రాసుకొచ్చింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నట్టు చెప్పింది. కాగా, గత అక్టోబరులో ఆలయంలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 20 మంది మహిళలలో మంజు కూడా ఒకరు కావడం గమనార్హం. విషయం తెలిసిన ఆందోళనకారులు కొల్లాంలోని ఆమె ఇంటిపై అప్పట్లో దాడి చేశారు. తాజాగా మంజు ఫేస్బుక్ పోస్టుతో మరోమారు కలకలం రేగింది.