Andhra Pradesh: మోదీ అయ్యప్ప స్వామిని కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు!: టీడీపీ నేత సీతారామలక్ష్మి
- ప్రధాని ఏ రాష్ట్రాన్నీ పట్టించుకోవడం లేదు
- హడావుడిగా ఈబీసీ బిల్లును తెచ్చారు
- కాపుల రిజర్వేషన్ ను చంద్రబాబే పట్టించుకున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రాన్నీ పట్టించుకోవడం లేదని టీడీపీ పార్లమెంటు సభ్యురాలు సీతారామలక్ష్మి ఆరోపించారు. కేరళలో అయ్యప్ప స్వామిని కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఏడాదిగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేవలం ఏపీ మాత్రమే కాకుండా మేఘాలయ, ఛత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాల్లోనూ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఓట్లు, సీట్ల కోసమే అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ రాజ్యసభ వాయిదాపడ్డ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కాపుల రిజర్వేషన్ కూడా చాలాకాలంగా పెండింగ్ లో ఉందని సీతారామలక్ష్మి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదన్నారు. కాపుల కోసం బడ్జెట్ లో సీఎం రూ.1000 కోట్లు కేటాయించారనీ, ఉపాధి కల్పన కోసం రుణాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా హడావుడిగా లోక్ సభలో సభ్యులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకూ కేంద్రంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.