Andhra Pradesh: క్వారీ పంచాయితీ.. పులివెందులలో చిన్నాన్న కొడుకు ఇంటిముందు వైఎస్ వివేకా ఆందోళన!
- 2008లో కుప్పం వద్ద క్వారీ లీజు
- లెక్కలు చెప్పని భాగస్వామి రాజశేఖర్ రెడ్డి
- ఇంటి ముందు బైఠాయించిన వైసీపీ నేత
వైసీపీ సీనియర్ నేత, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి తన చిన్నాన్న కొడుకు (కజిన్) ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఓ క్వారీకి సంబంధించి చెల్లింపులు చేయకపోవడంతో వివేకా ఈ మేరకు నిరసన తెలిపారు. వివేకానందరెడ్డి అనుచరుడు రవీంద్రనాథరెడ్డి, ప్రతాప్ రెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి కుప్పం వద్ద గ్రానైట్ క్వారీని భాగస్వామ్యంతో 2008లో లీజుకు తీసుకున్నారు.
ఈ క్వారీ 2012 వరకూ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే సాగింది. ఈ క్రమంలో దాదాపు రూ.50 లక్షల మొత్తాన్ని రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ క్వారీకి సంబంధించిన లెక్కలను రాజశేఖరరెడ్డి చూపలేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. చివరికి ఆయన వివేకానంద రెడ్డిని ఆశ్రయించడంతో ఆయన.. పులివెందులలో తమ్ముడు ప్రతాప్ రెడ్డి ఇంటిముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.