Srikakulam District: వైసీపీలోకి బొడ్డేపల్లి సత్యవతి కొడుకు రమేష్.. విజయసాయిరెడ్డితో భేటీ?
- శ్రీకాకుళం ఎంపీ స్థానంపై పోటీకి ఆసక్తి చూపినట్లు సమాచారం
- దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు మనవడే రమేష్ కుమార్
- శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి తన మనోగతాన్ని వెల్లడించినట్టు సమాచారం. అవకాశం ఇస్తే శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసినట్లు భోగట్టా. ఆముదాలవలస (ఆకులపేట గ్రామం)కు చెందిన ఆ తరం రాజకీయనాయకుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు మనవడే రమేష్.
ఈయన తల్లి సత్యవతి ఇంతకుముందు ఆముదాలవలస ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. గత కొంతకాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పేరున్న కుటుంబాల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావుది ఒకటి. జిల్లాలో తొలితరం నాయకుల్లో చాలామందికి ఆయన రాజకీయ గురువు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాజగోపాలరావుకు ఎన్జీ రంగా తర్వాత రాష్ట్రంలో సీనియర్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు ఉంది.
సత్యవతికి రాజగోపాలరావు మామగారైతే, రమేష్ కుమార్ ఆయన మనవడు. అయితే ఆముదాలవలస మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేసిన రమేష్‌కుమార్ గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేసి ఓటమిపాలవ్వడం గమనార్హం. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా రమేష్‌కుమార్ వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.