kcr: బుల్లెట్ ప్రూఫ్ కార్లకు బిల్లు చెల్లించాలంటూ కేసీఆర్ కు లేఖ రాసిన పోలీసు శాఖ
- ఎన్నికల ప్రచారంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించిన పోలీసు శాఖ
- బకాయిలు చెల్లించాలంటూ లేఖలు
- కేసీఆర్ సహా 33 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ భద్రత
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీల కీలక నేతలు, స్టార్ క్యాంపెయినర్లకు పోలీసు శాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. ఈ నేపథ్యంలో, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల బిల్లు బకాయిలు చెల్లించాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా 33 మంది నేతలకు పోలీసు శాఖ లేఖలు రాసింది.
గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించాయని ఈ సందర్భంగా పోలీసు శాఖ తెలిపింది. వీరికి డ్రైవర్లను కూడా కేటాయించామని చెప్పింది. కిలోమీటర్ల ఆధారంగా ధరను నిర్ణయించామని... ఒక్కో నాయకుడు రూ. 57 వేల నుంచి రూ. 7.7 లక్షల వరకు బకాయి ఉన్నట్టు తెలిపింది. జాబితాలో కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జానారెడ్డి, కిషన్ రెడ్డి, షబ్బీర్ అలీ, అక్బరుద్దీన్ ఒవైసీ తదితర నేతలు ఉన్నారని వెల్లడించింది.