Jagan: పవన్ విడిగా పోటీ చేసినా... లేక టీడీపీతో మరోసారి కలిసినా... ఏం జరుగుతుందో వైఎస్ జగన్ ఆసక్తికర విశ్లేషణ!
- పవన్ అభిమానుల ఓట్లే ఆయనకు వెళ్తాయి
- అదే జరిగితే చంద్రబాబు ఓటు బ్యాంకుకు నష్టం
- కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఓనర్ వైకాపాయే
- కలిసినా, విడిగా పోటీ చేసినా లాభం వైకాపాకే
ఆంధ్రప్రదేశ్ కు త్వరలో జరిగే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేస్తే ఏం జరుగుతుంది? మరో సారి తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఏమవుతుంది? ఈ విషయాలపై జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఏది జరిగినా తమకే లాభమంటూ, "ఒక్కటి చెప్పాలి. మీకో థియరీ. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేశారని అనుకో. ఏమవుతుంది? లాస్ట్ టైమ్ ఇదే చంద్రబాబుతో కలిసి పోటీ చేశారు.
పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించిన ప్రతి వ్యక్తి, అభిమానించిన ప్రతి వ్యక్తి చంద్రబాబునాయుడికే ఓటేశారు. ఊరూరూ చంద్రబాబు కోసం, బీజేపీ కోసం పవన్ తిరిగారు. నేను పూచీగా ఉన్నానని ఓటేయండని తిరిగారు. పవన్ కల్యాణ్ అంతగా తిరిగినందువల్ల ఆయన అభిమానులు ఓట్లు వేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సపరేట్ గా పోటీ చేస్తే ఏం జరుగుతుంది? ఆరోజు పవన్ ను అభిమానించి చంద్రబాబునాయుడికి ఎవరైతే ఓట్లు వేశారో... వాళ్లే బహుశా పవన్ కల్యాణ్ కు ఓటు వేసుకుంటారేమో. అందులో కూడా బహుశా అందరూ వేయరేమో... మెజారిటీ బహుశా వేసుకుంటారేమో. అప్పుడు ఓటు బ్యాంక్ ఎవరికి తగ్గుతుంది. తగ్గితే చంద్రబాబు ఓట్ బ్యాంక్ తగ్గుతుందే తప్ప మా ఓట్ బ్యాంక్ తగ్గే పరిస్థితి ఏమీ ఉండదు.
రెండో సినారియోకు వస్తాను. మళ్లీ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలసి పోటీ చేస్తే, అదే జరిగిందనుకో... ఏమవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు సోల్ ఓనర్స్ వైసీపీ ఒక్కటే. ప్రభుత్వానికి అనుకూలం, వ్యతిరేకం... రెండే రెండు అజెండాలు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబునాయుడి పాలన మీద ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందంటే, చంద్రబాబునాయుడికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బిహేవ్ చేసినా అలానే బిహేవ్ చేస్తారు" అని జగన్ విశ్లేషించారు.