Jagan: బీసీలపై ప్రేమంటే నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీపెట్టెలు ఇవ్వడం కాదన్నా: చంద్రబాబుపై జగన్ విసుర్లు
- బీసీల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదు
- బడుగుల పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలి
- చంద్రబాబు ఎన్నో తప్పుడు హామీలిచ్చారన్న జగన్
బీసీలపై తనకు ప్రేముందని చెప్పుకునే చంద్రబాబునాయుడు, వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బీసీలు బాగుపడాలంటే, వారిని ఉన్నత విద్యావంతులను చేయడమే ముఖ్యమని తాను నమ్ముతానని అన్నారు.
"బీసీలపై ప్రేమంటే నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీపెట్టెలు ఇవ్వడం కాదన్నా. పిల్లల్ని చదివించాలి. అప్పులపాలు కాకుండా చదివించాలి. ఆ పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేయాలి. కాస్తో కూస్తో ఇంటికి పంపించే స్థాయికి రావాలి. అప్పుడు బీసీలపై ప్రేమ ఉందని అంటారుగానీ, ఇంత మోసగాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా?" అని చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
తన పాదయాత్రలో ఎన్నో బీసీ సంఘాలు ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావించాయని గుర్తు చేసుకున్న ఆయన, తొమ్మిదేళ్లుగా సీఎంగా పాలించిన అనుభవం ఉన్న చంద్రబాబు, తాను చేయలేనని తెలిసి కూడా తప్పుడు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కొత్తగా కొన్ని కులాలను బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తానని ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. తమను చంద్రబాబు అడ్డగోలుగా మోసం చేశారని ప్రజలు అంటున్నారని చెప్పారు.