NTR vydya seva: ముదురుతున్న ఎన్టీఆర్ వైద్యసేవల వివాదం...అత్యవసర సేవలూ నిలిపేస్తామని ఆసుపత్రుల హెచ్చరిక
- ఈనెల 8వ తేదీ డెడ్‌లైన్
- బకాయి నిధులు విడుదల చేయనందుకు నిరసన
- ఒకటి నుంచే పలు సేవలు నిలిపివేత
ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిల వివాదం ముదురుతోంది. తక్షణం నిధులు విడుదల చేయకపోతే డయాలసిస్ వంటి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం అల్టిమేటం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల వైద్యం కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తోంది. ఈ సేవలను అందిస్తున్న దాదాపు 350 ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.500 కోట్ల వరకు బకాయి ఉంది.
ఈ బకాయిలు విడుదల చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జనవరి ఒకటి నుంచి అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిని నిలిపివేశాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈనెల 8వ తేదీ నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు వెనుకాడమని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (ఆశా) తెలిపింది. సోమవారం నిర్వహించే ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయ కమిటీ సమావేశంలో తమ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సిందేనని, లేదంటే తమ నిర్ణయం అమలు చేస్తామని ఆశా స్పష్టం చేసింది.